Virat Kohli: కోహ్లీ ఆ స్థానంలోనే బ్యాటింగ్ కు దిగాలి: ఏబీ డివిలియర్స్
- త్వరలో ఆసియా కప్... ఆ తర్వాత వరల్డ్ కప్
- కోహ్లీ 4వ స్థానంలో ఆడాలన్న డివిలియర్స్
- టీమిండియాకు మేలు చేస్తుందన్న సఫారీ దిగ్గజం
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ పై స్పందించాడు.
కోహ్లీ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ కు రావాలని, ఆ స్థానంలో అతడే సరైన ఆటగాడు అని పేర్కొన్నాడు. ఆ స్థానంలో రావడం వల్ల ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు కోహ్లీకి సాధ్యమవుతుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. ఇన్నింగ్స్ మూలస్తంభంలా నిలవాలన్నా, లేక ఇన్నింగ్స్ ను దూకుడుగా నడిపించాలన్నా 4వ స్థానంలో వచ్చినప్పుడు వీలవుతుందని వివరించాడు.
అయితే, కోహ్లీకి 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగడమే ఇష్టమని అందరికీ తెలుసని, కానీ జట్టు అవసరాల కోసం కోహ్లీ త్యాగం చేయకతప్పదని సూచించాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన నేపథ్యంలో, టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డివిలియర్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
4వ స్థానంలో ఆడినప్పుడు కోహ్లీ గణాంకాలు చూస్తే డివిలియర్స్ వ్యాఖ్యలు నిజమే అనిపిస్తాయి. 4వ స్థానంలో కోహ్లీ 7 సెంచరీలు చేయడం విశేషం. అంతేకాదు, సగటు 55.21 కాగా, స్ట్రయిక్ రేట్ 90.66 ఉంది.
ఈ నెల 30 నుంచి ఆసియా కప్ పోటీలు జరగనుండగా, టీమిండియా ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. అయితే, ఫిట్ నెస్ సమస్యల నుంచి కోలుకుని వచ్చిన కీలక ఆటగాళ్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత వరల్డ్ కప్ కూడా ఉండడంతో ఈలోపే జట్టు కూర్పుకు ఓ రూపునివ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.