Andhra Pradesh: ఆలయం శిఖరంపైనున్న బంగారు కలశం అదృశ్యం.. గుడివాడలో కలకలం
- గుడివాడలోని సిద్ధాంతం గ్రామంలోని బాలా త్రిపుర సుందరి ఆలయంలో ఘటన
- శనివారం ఆలయ పర్యవేక్షకులకు కలశం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
- చెట్టు కొమ్మలు తగిలి కిందపడ్డ కలశాన్ని కోతులు ఎత్తుకెళ్లిపోయి ఉండొచ్చని ఆలయ నిర్వాహకుల అనుమానం
- కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
దేవాలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గుడివాడలోని సిద్ధాంతం గ్రామ శివాలయంలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. సుమారు 12 ఏళ్ల క్రితం ఆలయ ధర్మకర్తలు గోపురంపై ఉన్న రెండు శిఖరాలకు కిలో చొప్పున బరువుగల రెండు కలశాలను ఏర్పాటు చేశారు. అయితే, శనివారం అమ్మవారి ఆలయాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన వ్యక్తి కలశం లేకపోవడాన్ని గుర్తించి ఆలయ ధర్మకర్తలకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పరిస్థితిని సమీక్షించారు.
కాగా, ఇటీవల కాలంలో ఆలయ శిఖరం వరకూ విస్తరించిన మర్రి చెట్టు కొమ్మలు ఈదురు గాలులకు కలశాలకు తగులుతున్నట్టు ఆలయ నిర్వహకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొమ్మలు తగిలి కింద పడ్డ కలశాన్ని కోతులు ఎటైనా తీసుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.