Bus Bay: విశాఖలో రూ.40 లక్షలు వెచ్చించి కడితే 4 రోజులకే కుంగిన బస్ షెల్టర్
- జీవీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నగర వాసులు
- నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని కార్పొరేటర్ల ఆరోపణ
- కుంగిన బస్ షెల్టర్ వద్ద సీపీఎం, జనసేన కార్పొరేటర్ల ఆందోళన
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన బస్ షెల్టర్ ఒకటి కుంగిపోయింది. ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అట్టహాసంగా ప్రారంభించిన ఈ బస్ బే.. ఐదు రోజులకే కుంగిపోవడంపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడ్రన్ బస్ షెల్టర్ పేరుతో రూ.40 లక్షలు వెచ్చించి కట్టిన నిర్మాణం నాలుగు రోజులు కూడా నిలవలేదని మండిపడుతున్నారు.
బస్ షెల్టర్ల నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ కార్యాలయం ముందు కట్టిన బస్ షెల్టర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా చోట్ల కట్టిన వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నాసిరకం పనుల వల్ల నాలుగు రోజులకే బస్ షెల్టర్ కుంగిందని, ఇది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడడమేనని విమర్శిస్తున్నారు. కుంగిన బస్ షెల్టర్ ముందు ఆందోళన చేపట్టారు. బస్ షెల్టర్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.