KTR: అది డిక్లరేషన్ సభలా లేదు... ఫ్రస్ట్రేషన్ సభలా ఉంది: మంత్రి కేటీఆర్

KTR slams Congress declaration

  • ఆగస్టు 26న చేవెళ్లలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభ
  • ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటన
  • కాంగ్రెస్ ఇచ్చిన 12 హామీలు గాల్లో దీపాలేనన్న కేటీఆర్ 
  • నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచారని విమర్శలు

కాంగ్రెస్ పార్టీ నిన్న (ఆగస్టు  26) చేవెళ్లలో ప్రజాగర్జన సభ నిర్వహించడం, ఈ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ  కనీసం రేషన్ ఇవ్వలేకపోతోందని, ఇక్కడికొచ్చి డిక్లరేషన్ ఇస్తే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. 

"కర్ణాటకలో కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ అక్కడి ప్రజలను నట్టేట ముంచారు. ఇక్కడ మీ 12 హామీలకు విలువ ఉందా? ఆ 12 హామీలు గాల్లో దీపాలే. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం తెలుసు. అయినా అది డిక్లరేషన్ సభలా లేదు, ఓటమి తప్పదని తెలిసిన తర్వాత జరిగిన ఫ్రస్ట్రేషన్ సభలా ఉంది" అని ఎద్దేవా చేశారు. 

"స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.... ఇప్పటికీ ఎస్టీ, ఎస్సీ, బీసీలు వెనుకబడి ఉన్నారంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపం మరో వందేళ్లయినా వెంటాడుతూనే ఉంటుంది" అని విమర్శించారు. 

ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ప్రభుత్వం మాది... ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ మీది అంటూ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు 'ఎక్స్' లో స్పందించారు.

  • Loading...

More Telugu News