Rahul Gandhi: ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో అంతా మహిళలే... ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ!
- ఇటీవల వాయనాడ్ వెళ్లిన రాహుల్
- మార్గమధ్యంలో ఊటీలో ఆగిన వైనం
- మోడీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ సందర్శన
- ఇక్కడి చాక్లెట్ల రుచి అద్భుతమన్న రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానల్లో ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. అందులో, ఆయన ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన దృశ్యాలు ఉన్నాయి. ఇటీవల ఆయన తన సొంత నియోజకవర్గం వాయనాడ్ వెళుతూ మార్గమధ్యంలో ఊటీలో ఆగారు. అక్కడ అంతా మహిళలే నిర్వహిస్తున్న ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందిని అడిగి చాక్లెట్ల తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం తాను కూడా కొన్ని చాక్లెట్లను తయారుచేశారు.
మురళీధర్ రావు, స్వాతి అనే స్ఫూర్తిదాయక దంపతులు ఈ మోడీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ స్థాపన వెనుక కీలకపాత్ర పోషించారని రాహుల్ వెల్లడించారు. వీరికి ఇతర మహిళల బృందం సహకరిస్తోందని, ఈ 70 మంది మహిళలు తయారుచేస్తున్న చాక్లెట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, వాటిలో కొన్ని తాను ఎప్పుడూ రుచి చూడనంత అమోఘంగా ఉన్నాయని కితాబిచ్చారు.
గబ్బర్ సింగ్ ట్యాక్స్ లతో ఈ చిన్న పరిశ్రమ కూడా సతమతమవుతోందని తెలిపారు. ఇలాంటి పరిశ్రమలను ఆదుకోవడానికి సింగిల్ జీఎస్టీ వంటి చర్యలు తీసుకోవాలని రాహుల్ సూచించారు.