Student Slapping Row: యూపీలో ఆ స్కూలు మూసివేత.. కొనసాగుతున్న దర్యాప్తు
- రెండో తరగతి చదువుతున్న ముస్లిం బాలుడిని విద్యార్థులతో కొట్టించిన ఉపాధ్యాయురాలు
- యూపీలోని ముజఫర్‌నగర్ స్కూల్లో ఘటన
- వీడియో వైరల్ కావడంతో చెలరేగిన విమర్శలు
- స్కూలు గుర్తింపు రద్దు చేసిన విద్యాశాఖ
- విద్యార్థులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయాలని ఆదేశాలు
రెండో తరగతి చదువుతున్న ముస్లిం విద్యార్థి చెంపలు పగలగొట్టించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కూలును అధికారులు మూసివేశారు. ఎక్కాలు అప్పజెప్పలేదన్న ఒకేఒక్క కారణంతో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఉన్న నేహా పబ్లిక్ స్కూల్ టీచర్ తోటి విద్యార్థులతో ముస్లిం బాలుడిని కొట్టించింది. అంతేకాకుండా గట్టిగా కొట్టాలంటూ దగ్గరుండి ప్రోత్సహించింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. దీనిపై కేసు కూడా నమోదైంది.
స్కూలును మూసివేయాలంటూ తాజాగా విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే అందులో చదువుకుంటున్న విద్యార్థులను సమీపంలోని స్కూళ్లలో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ పాఠశాలలో 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూలు గుర్తింపును వెనక్కి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని ప్రాథమిక విద్య అధికారి శుభమ్ శుక్లా తెలిపారు. పోలీసులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు త్రిపాఠి త్యాగిపై కేసు నమోదు చేశారు. ఘటన తర్వాతి నుంచి ఆందోళనగా ఉన్న బాధిత బాలుడు, నిద్రకు కూడా దూరం కావడంతో వైద్య పరీక్షల కోసం నిన్న మీరట్ ఆసుపత్రికి తరలించారు.