health insurance: చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేది.. అందుకే!
- దేశంలో 15 శాతం మంది ఆరోగ్య బీమా పొందలేని పరిస్థితి
- ప్రతిబంధకంగా మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు
- స్పష్టం చేస్తున్న పాలసీబజార్ డేటా
హెల్త్ ఇన్సూరెన్స్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ కు వయసుతో సంబంధం లేదు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముదుసలి వరకు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమే. ఎందుకంటే ఎప్పుడు అనారోగ్యం వస్తుందో, ఎప్పుడు జీవనశైలి వ్యాధుల బారిన పడతామో ఎవరికి తెలుసు..?
పాలసీబజార్ డేటా ప్రకారం.. మనదేశంలో 15 శాతం మంది ప్రజలు (45 ఏళ్లలోపు ఉన్న వారు) హెల్త్ ఇన్సూరెన్స్ ను పొందలేకపోయారు. దీనికి కారణం వారికి అప్పటికే గుండె జబ్బులు, అనియంత్రిత మధుమేహం, తీవ్రమైన కాలేయ, ఊపిరితిత్తుల సమస్యలు ఉండడమే కారణం. ఆరోగ్య బీమా లేని వీరిలో 17 శాతం మందిలో నియంత్రణలోకి రాని స్థాయిలో మధుమేహం సమస్య ఉంది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పొందడానికి మధుమేహం పెద్ద అడ్డంకి అని తెలుస్తోంది.
ఇక 16 శాతం మందికి ఆరోగ్య బీమా రాకపోవడానికి గుండె జబ్బులు, 13 శాతం మందిలో తీవ్ర కాలేయం సమస్యలు, 12 శాతం మందిలో తీవ్ర ఊపిరితిత్తుల సమస్యలు, 11 శాతం మందికి కేన్సర్, 10 శాతం మందిలో మూత్ర పిండాల సమస్యలు ప్రతిబంధకంగా ఉన్నట్టు పాలసీబజార్ డేటా చెబుతోంది. అప్పటికే వ్యాధులు ఉన్నా కానీ ఆరోగ్య బీమా ప్లాన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కంపెనీలు ఇందుకోసం అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తాయి. సమస్య మరీ తీవ్రంగా ఉందని తెలిస్తే దరఖాస్తు తిరస్కరించొచ్చు. పాలసీ మంజూరు చేసినా కానీ, విధించే ప్రీమియం ఆరోగ్యవంతులైన వారితో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువే ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న వయసులోనే హెల్త్ ప్లాన్ తీసుకోవాలి.