Neeraj Chopra: భారత జెండాపై నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరిన విదేశీ మహిళ.. అతను చేసిన పనికి శభాష్ అనాల్సిందే!

Neeraj Chopra gesture wins hearts as he refused to sign on Indian flag
  • ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో స్వర్ణం గెలిచిన నీరజ్
  • ఫైనల్లో జావెలిన్ ను 88.17 మీటర్ల దూరం విసిరిన చోప్రా
  • ఆట ముగిసిన తర్వాత అభిమానులను కలిసిన భారత స్టార్
టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణంతో చరిత్రకెక్కిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ లోనూ బంగారు పతకం సాధించి ఔరా అనిపించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. దాంతో, నీరజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ కు ఇప్పటికే భారత్ తో పాటు విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో చారిత్రక విజయం తర్వాత స్టేడియంలోని అభిమానుల దగ్గరికి వెళ్లిన నీరజ్ అడిగిన వారితో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

అనర్గళంగా హిందీ మాట్లాడుతున్న ఓ హంగేరీ మహిళ నీరజ్ ను కలిసి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరింది. దీనికి నీరజ్ సరే అన్నాడు. అయితే, సంతకం చేయమంటూ భారత జెండాను అతని ముందు ఉంచింది. కానీ, త్రివర్ణ పతాకంపై  మాత్రం సంతకం చేయను అని నీరజ్ ఆమెతో చెప్పాడు. చివరకు టీ షర్ట్ స్లీవ్ పై నీరజ్ ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆ యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అదే సమయంలో భారత జెండాపై గౌరవంతో దానిపై సంతకం చేయని నీరజ్ పైనా ప్రశంసలు కురుస్తున్నాయి. విశ్వవేదికపై తన ఆటతో భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించడమే కాదు.. దాన్ని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి అని నీరజ్ నిరూపించుకున్నాడు.
Neeraj Chopra
India
flag
gold
olympics

More Telugu News