China: వధువు వయసు 25 ఏళ్లలోపు ఉంటే నగదు బహుమతి.. చైనా ప్రభుత్వం బంపరాఫర్
- వయసులో ఉండగా పెళ్లిళ్లు, సంతానాన్ని ప్రోత్సహించే ప్రయత్నం
- గత ఆరు దశాబ్దాల్లో తొలిసారి జనాభా పెరుగుదలలో భారీ క్షీణత
- పిల్లల పెంపకం భారంగా మారడంతో సంతానానికి నో చెబుతున్న దంపతులు
- ఫలితంగా పడిపోతున్న జననాల రేటు
దేశంలో జననాల రేటు భారీగా పడిపోతుండడంతో చైనాలోని ఓ కౌంటీ నవదంపతులకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. వధువు వయసు 25 ఏళ్లు, అంతకంటే తక్కువ ఉంటే 1000 యువాన్ల (మన కరెన్సీలో దాదాపు రూ. 11 వేలకుపైగా) నగదు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. చాంగ్‌షన్ కౌంటీ ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వియ్‌చాట్‌లో ప్రకటించింది. వయసులో ఉండగానే వివాహం, తద్వారా సంతానాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అలాగే, పిల్లలున్న దంపతులకు పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి, విద్యలో రాయితీలు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.
గత ఆరు దశాబ్దాల్లో చైనాలో తొలిసారి జనాభా క్షీణత కనిపించింది. అలాగే, వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్న అధికారులు ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ జనన రేటును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. చైనాలో అబ్బాయిల పెళ్లి వయసు 22 సంవత్సరాలు కాగా, అమ్మాయిల పెళ్లి వయసు 20 ఏళ్లు. అయితే, పెళ్లిళ్లు చేసుకునే జంటల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో జననాల రేటు భారీగా తగ్గిపోయింది. అక్కడి అధికారిక విధానాలు ఒంటరి మహిళ పిల్లల్ని కనడాన్ని అడ్డుకుంటుండడం కూడా జననాల రేటు భారీగా పడిపోవడానికి మరో కారణం.
2022లో చైనాలో వివాహాల రేటు దారుణంగా పడిపోయింది. ఆ ఏడాది అక్కడ 6.8 మిలియన్ల మంది మాత్రమే పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో కంటే 8 లక్షల వివాహాలు తగ్గిపోయాయి. 1986 తర్వాత ఇదే కనిష్ఠం. అలాగే, జననాల రేటు కూడా ప్రపంచంలోనే అతి తక్కువ. నిరుడు అక్కడ 1.09 శాతం జననాలు మాత్రమే రికార్డయ్యాయి. చైనాలో పిల్లల పెంపకం అత్యంత ఖర్చుతో కూడుకోవడం, పిల్లల్ని కన్న తర్వాత తమ కెరియర్ ముగిసిపోతుండడంతో చాలామంది మహిళలు పిల్లలు కనడాన్ని విరమించుకుంటున్నారు.