Chat GPT: చాట్ జీపీటీకి పోటీగా జియో నుంచి కొత్త ఏఐ సిస్టమ్స్
- రూపొందిస్తామని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటన
- భారతీయ వినియోగదారులందరి కోసం అందుబాటులోకి తెస్తామన్న అంబానీ
- ప్రతి ఒక్కరికి, ప్రతి చోట జియో ఏఐని అందిస్తుందని హామీ
రెండు నెలల క్రితం భారత్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సీఈవో, చాట్ జీపీటీ రూపకల్పనలో కీలక వ్యక్తి అయిన సామ్ ఆల్ట్ మాన్ భారతీయులు చాట్ జీపీటీ ఏఐ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నించొచ్చు కానీ అది వ్యర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. దీన్ని భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సీరియస్ గా తీసుకున్నారు. ఆల్ట్ మాన్ మాటలను సవాల్ గా తీసుకొని భారతీయ వినియోగదారుల కోసం చాట్ జీపీటీ తరహాలో తమ జియో సంస్థ కొత్త ఏఐ సిస్టమ్‌లను రూపొందిస్తుందన్నారు. సోమవారం రిలయన్స్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
‘జియో ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా ఏఐని వాగ్దానం చేస్తుంది. దాన్ని మేం అందజేస్తాం‘ అని ఆయన స్పష్టం చేశారు. చాట్ జీపీటీతో పోల్చదగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాన్ని అభివృద్ధి చేయగల భారతీయ సాంకేతిక రంగం సత్తాపై ఆల్ట్ మాన్ ఇటీవల తన సందేహాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అలాంటి ప్రయత్నంతో ఫలితం రాబోదని, ఇందుకు భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందన్నాడు. దీనిపై స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఏఐలో రాణించటానికి అవసరమైన వనరులు, నిబద్ధత భారత్ సొంతమని అన్నారు.