Telangana: తెలంగాణ రైతులకు, ప్రజలకు చేదు వార్త.. సెప్టెంబర్ లోనూ వర్షాలు కష్టమేనట!
- అంచనా వేసిన వాతావరణ శాఖ
- 1972 తర్వాత ఆగస్టు నెలలో అత్యల్ప వర్షపాతం నమోదు
- ఎల్నినో ప్రభావమే కారణం అంటున్న నిపుణులు
తెలంగాణలో ఆలస్యంగా వచ్చిన వర్షాలు కొన్ని రోజులకే ముఖం చాటేశాయి. వర్షాకాలంలోనూ పగటి పూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1972 తర్వాత ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఈసారే అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 60 శాతం తక్కువ కావడం గమనార్హం. కనీసం వచ్చే నెలలో అయినా మంచి వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న రైతులకు వాతావరణ శాఖ చేదు వార్త చెప్పింది. వచ్చే నెలలోనూ వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తోంది.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని తెలిపింది. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్లో లోటు వర్షాపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా మంచి వర్షాపాతం నమోదైంది. కానీ, తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.