Praggnanandhaa: చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందకు 'థార్' ఇవ్వాలన్న నెటిజన్లు... ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే...!
- ఫిడే వరల్డ్ కప్ రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానంద
- కొద్దిలో వరల్డ్ కప్ టైటిల్ కోల్పోయిన వైనం
- ప్రజ్ఞానందకు మహీంద్రా ఎక్స్ యూవీ 400 ఈవీ ఇవ్వాలని ఆనంద్ నిర్ణయం
భారత చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద ఇటీవల అజర్ బైజాన్ లో జరిగిన ఫిడే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే సంచలనాల మోత మోగిస్తున్న ప్రజ్ఞానంద త్రుటిలో వరల్డ్ కప్ టైటిల్ కోల్పోయాడు. అయినప్పటికీ తన ప్రతిభతో యావత్ భారతావని ప్రేమాభిమానాలను గెలుచుకున్నాడు.
కాగా, ప్రజ్ఞానందకు మహీంద్రా థార్ వాహనాన్ని కానుకగా ఇవ్వాలంటూ చాలామంది నెటిజన్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను కోరారు. వాటిలో ఓ పోస్టుపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ప్రజ్ఞానందకు తప్పకుండా నజరానా అందిస్తానని, అయితే తన ఆలోచన మరోలా ఉందని వెల్లడించారు. తాను మహీంద్రా ఎక్స్ యూవీ 400 ఈవీ ఎలక్ట్రిక్ కారును బహూకరిద్దామనుకుంటున్నానని తెలిపారు.
"చాలాంది ప్రజ్ఞానందకు థార్ వాహనం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ నేను అలా అనుకోవడంలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ ఆడేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. వీడియో గేమ్స్ హవా కొనసాగుతున్న ఈ కాలంలోనూ మెదడుకు మేత లాంటి ఈ చదరంగం వైపు తమ పిల్లలను నడిపించాలని భావిస్తున్నాను.
ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి ఎలాంటి మేలు చేస్తాయో, తమ పిల్లలు చెస్ వంటి క్రీడను ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా అలాంటిదే. ఒకరకంగా ఇది మెరుగైన భవిష్యత్ కు పెట్టుబడి వంటిది.
అందుకే మహీంద్రా ఎక్స్ యూవీ 400 ఈవీ కారును ప్రజ్ఞానంద అభ్యున్నతికి కారకులైన అతడి తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్ బాబుకు అందిస్తాను. తమ బిడ్డ అభిరుచి పట్ల అడుగడుగునా అండగా నిలిచి, అతడిని తీర్చిదిద్దిన ఆ దంపతులకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం" అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.