TDP: 'ఇసుక' అంశంలో టీడీపీ నిరసనలు... రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల గృహనిర్బంధం
- వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందంటూ టీడీపీ పోరాటం
- ఇసుక సత్యాగ్రహానికి పిలుపునిచ్చిన పార్టీ అధినాయకత్వం
- మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా గృహ నిర్బంధం
- తిరుపతి జిల్లాలోనూ హౌస్ అరెస్టులు
వైసీపీ సర్కారు ఇసుక దోపిడీకి పాల్పడుతోందంటూ విపక్షం టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా చేపడుతున్నారంటూ ఈ నెల 28 నుంచి 30 వరకు ఇసుక సత్యాగ్రహం చేపట్టారు. నేడు మైనింగ్ శాఖ డీడీని కలవాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.
ఇవాళ మూడో రోజు కూడా ఇసుక సత్యాగ్రహం నిరసనలు చేపట్టగా, ఉద్రిక్తతలకు దారితీశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడ గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను గృహ నిర్బంధం చేశారు. ఉమ నివాసం వద్ద అర్ధరాత్రి నుంచి భారీగా పోలీసులను మోహరించారు.
ఇబ్రహీంపట్నంలోని డీఎంజీ ప్రధాన కార్యాలయ ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందంటూ ఆధారాలను డీఎంజీకి చూపించాలని టీడీపీ నిర్ణయించింది.
అటు, గుంటూరు టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజాలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు జిల్లా ముఖ్య నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తిరుపతి జిల్లాలోనూ హౌస్ అరెస్టుల పర్వం కొనసాగింది. ఇసుక సత్యాగ్రహం నేపథ్యంలో టీడీపీ నేతలకు ముందుగానే గృహ నిర్బంధం విధించారు. తిరుపతిలో నరసింహయాదవ్, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ లను హౌస్ అరెస్ట్ చేశారు.