Rice Export: సింగపూర్ కు బియ్యం ఎగుమతులకు కేంద్రం ఓకే
- రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధం నేపథ్యంలో నిర్ణయం
- బియ్యం ఎగుమతులపై జులై 20 నుంచి కేంద్రం ఆంక్షలు
- సింగపూర్ కు ప్రత్యేకంగా మినహాయింపు ప్రకటించిన ప్రభుత్వం
నాన్ బాస్మతి రైస్ మినహా మిగతా బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. జులై 20 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దేశీయంగా బియ్యం లభ్యత, ధరల నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో బియ్యానికి డిమాండ్ పెరిగి, చాలా దేశాల్లో కొరత ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలలో బియ్యం కోసం సూపర్ మార్కెట్లకు జనం పోటెత్తారు. షాపులలో బియ్యం నిల్వలు అడుగంటాయి. దీంతో బియ్యం ఎగుమతులపై బ్యాన్ విషయంపై పునరాలోచించాలని వివిధ దేశాలు భారత్ కు విజ్ఞప్తి చేశాయి.
తాజాగా బియ్యం ఎగుమతులపై విధించిన బ్యాన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగపూర్ కు ఈ ఆంక్షలు/ నిషేధం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు, మైత్రిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ప్రయోజనాలతో పాటు సింగపూర్ తో ఉన్న ఆర్థిక బంధాలను గౌరవిస్తూ ఆ దేశానికి బియ్యం ఎగుమతులకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేస్తామని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.