Donald Trump: అమెరికా చరిత్రలో బైడెన్ పనికిమాలిన అధ్యక్షుడు: ట్రంప్
- బైడెన్ కు మతిభ్రమించిందని వ్యాఖ్యానించిన మాజీ ప్రెసిడెంట్
- ఆయన పిచ్చి వల్ల మూడో ప్రంపంచ యుద్ధమేనని హెచ్చరిక
- దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని విమర్శలు
అమెరికా చరిత్రలోనే అత్యంత పనికిమాలిన అధ్యక్షుడు బైడెనేనని మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తన హయాంలో సరిహద్దుల్లో నిర్మించిన బార్డర్ వాల్ విషయంలో బైడెన్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బైడెన్ కు మతిభ్రమించిందంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. బైడెన్ పిచ్చి వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ఈమేరకు డొనాల్డ్ ట్రంప్ మీడియాకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
అధ్యక్షుడిగా జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు, కీలక అంశాలలో ఆయన నిర్లక్ష్యం అమెరికా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి రక్షణ కవచమైన సరిహద్దు గోడ విషయంలో బైడెన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆ గోడ లేకుంటే దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు.