Tirumala: సెప్టెంబర్ 18 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టు వస్తాలను సమర్పించనున్న జగన్
- సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు
- అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు
- సిఫారసు లేఖలు స్వీకరించబోమన్న భూమన
సెప్టెంబర్ 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18 నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ మధ్యాహ్నం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను భూమన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల తొలి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తుల వసతులు, భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.