China: అక్సాయ్‌చిన్‌లో బంకర్లు, సొరంగాలు నిర్మిస్తోన్న చైనా
- ఉత్తర లడఖ్ సరిహద్దు సమీపంలో సొరంగాలు, బంకర్లు, రోడ్ల నిర్మాణం
- మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగులోకి నిర్మాణాలు
- ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా మ్యాప్
- తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉత్తర లడఖ్‌లోని సరిహద్దు సమీపంలో డ్రాగన్ దేశం పలు సొరంగాలు, బంకర్లను, రోడ్లను నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వైరల్‌గా మారాయి. తమ ప్రాంతమంటూ పేర్కొంటున్న అక్సాయ్ చిన్‌లోనే ఈ నిర్మాణాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ రూపొందించిన మ్యాప్‌ను చైనా ఇటీవల విడుదల చేసింది. ఈ మ్యాప్‌పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారీ నిర్మాణాలు ఆందోళన కలిగించే అంశం.
ఇక్కడ అనేక బంకర్లు, సొరంగాల నిర్మాణం చేపట్టినట్లు మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటితో పాటు రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సొరంగాల ప్రవేశం వద్ద నిర్మాణ సామగ్రి భారీస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అక్సాయ్ చిన్‌లో భారత వాయుసేనకు ఉన్న సానుకూలతలు, ఒకవేళ దాడులకు పాల్పడితే దీటుగా ఎదుర్కోవడానికి చైనా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.