covid 19: కరోనా కొత్త వేరియంట్ ‘పిరోలా’తో భారతీయులకు ముప్పుందా..?
- ఈ ఏడాది జులైలో గుర్తించనట్లు డబ్ల్యూహెచ్ వో వెల్లడి
- అమెరికా, యూకే, చైనా, డెన్మార్క్ లలో కేసులు
- అప్రమత్తంగా ఉన్నామంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా సమసిపోలేదని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. వివిధ దేశాల్లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని హెచ్చరించింది. తాజాగా మరో కొత్త వేరియంట్ బీఏ.2.86 ను గుర్తించినట్లు తెలిపింది. ‘పిరోలా’ గా వ్యవహరిస్తున్న ఈ కొత్తరకం కరోనా కేసులు అమెరికా, యూకే, చైనా, డెన్మార్క్ లలో నమోదవుతున్నాయని వివరించింది. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిపుణులు పిరోలా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే పలు రీజియన్లకు పాకిందని, వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన కేసులను పరిశీలించగా.. బాధితులపై పిరోలా లక్షణాల్లో తీవ్రత లేదన్నారు. అయితే, వైరస్ వ్యాప్తి మాత్రం వేగంగా జరుగుతోందని చెప్పారు. కాగా, విదేశాలలో పిరోలా కేసులు గుర్తించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వైరస్ మన దేశంలోకి రాలేదని పేర్కొంది.
పిరోలా ప్రమాదకరమా?
గతంలో కరోనా బారిన పడిన వాళ్లకు, రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికీ పిరోలా సోకుతున్న విషయాన్ని గుర్తించినట్లు సీడీసీ నిపుణులు తెలిపారు. దీనిని బట్టి పిరోలా వేరియంట్ చాలా పరివర్తనాలకు గురైందని తెలుస్తోందన్నారు. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లతో పోలిస్తే పిరోలా మరింత శక్తిమంతమైందని వివరించారు. ఈ వేరియంట్ కు సంబంధించిన శాంపిల్ ఇంకా తమకు అందలేదని, శాంపిల్ ను పరిశీలించాకే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమనేది చెప్పగలమని పేర్కొన్నారు.
పిరోలా లక్షణాలు..
జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మంపై దద్దుర్లు, కళ్ల కలక, డయేరియా, శ్వాస అందకపోవడం, తలనొప్పి, కండరాల నొప్పులు, దగ్గు, వాసన రుచి కోల్పోవడం.