Harish Rao: అమిత్ షా, మల్లికార్జున ఖర్గేపై హరీశ్ రావు సెటైర్లు
- ఖర్గే, అమిత్ షా టూరిస్టుల్లా వచ్చి వెళ్లారన్న హరీశ్
- కాంగ్రెస్, బీజేపీ నకిలీ, వెకిలి హామీలు ఇస్తున్నాయని మండిపాటు
- నకిలీ డిక్లరేషన్లు ఇస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్య
కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలు టూరిస్టులని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను విమర్శించే వాళ్లు రాష్ట్ర పరిస్థితిని చూసి మాట్లాడాలని అన్నారు. నినాదాలు ఇచ్చే పార్టీలు కొన్ని ఉంటాయని, నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్ ఈ రోజు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ‘‘ఖర్గే, అమిత్ షా టూరిస్టుల్లా వచ్చి వెళ్లారు. బీజేపీ స్థానిక నేతలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివి అమిత్ షా వెళ్లిపోయారు. అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో పగలు కూడా కరెంటు ఉండట్లేదు. అక్కడి గుడ్డి పాలనను సరి చేయలేరు కానీ.. ఇక్కడ డ్రామాలు చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నకిలీ, వెకిలి హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. నకిలీ డిక్లరేషన్లు ఇస్తే ప్రజలు నమ్మరన్నారు. ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో అలవికాని హామీలు ఇచ్చి చతికిలపడ్డారని అన్నారు. అక్కడ బీజేపీపై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందని చెప్పారు.