Nara Lokesh: నేను జగన్మోహన్ రెడ్డిలా ఊరికో మాట చెప్పే రకం కాదు: లోకేశ్
- పోలవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- యువగళంలో భాగంగా గిరిజనులతో లోకేశ్ ముఖాముఖి
- లోకేశ్ ను పలు ప్రశ్నలు అడిగిన గిరిజనులు
- స్పష్టంగా సమాధానాలు ఇచ్చిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 200వ రోజు మైలురాయికి చేరుకోవడంతో యువగళం పాదయాత్రలో సంబరాలు మిన్నంటాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దండమూడి కళ్యాణ మండపం వద్ద నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా తల్లి భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబసభ్యులు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు శిబిరంలో లోకేశ్ ను కలిసి రాఖీలు కట్టారు. తన పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీతంపేట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. వైసీపీ సర్కారు వివిధ వర్గాల ప్రజలపై బనాయించిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీ ఇస్తూ పైలాన్ ను ఆవిష్కరించారు.
లోకేశ్ కొయ్యలగూడెంలో గిరిజనులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి గిరిజన నేత వెంకటప్ప సంధానకర్తగా వ్యవహరించారు.
సమావేశంలో గిరిజనులు అడిగిన ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలు
వెంకటప్ప: మాలాంటి వెనుకబడిన వర్గాల పట్ల మీకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఏంటి?
లోకేశ్: నా పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న రోజున శ్రీశైలం నియోజకవర్గంలో చెంచులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల సమస్యలు తెలుసుకున్నాను. 200 రోజులు నేడు పూర్తి చేసుకున్న రోజున పోలవరం నియోజకవర్గంలో గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 500 జనాభా కంటే ఎక్కువగా ఉన్న తండాలను పంచాయతీలుగా చేశాను. మేం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో తండాలకు సురక్షిత మంచినీటిని అందిస్తాం. పక్కా గృహాలు కట్టించే బాధ్యతను మేం తీసుకుంటాం. అవసరమైన మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం.
హేమలత: గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారు. 6.5 శాతం జనాభా ఉన్న మాకు సౌకర్యాలు అందడం లేదు. మీరు అధికారంలోకి వస్తే మాకు ఏం చేస్తారు?
లోకేశ్: మేం అధికారంలో ఉండగా గుమ్మడి సంధ్యారాణిని మంత్రిని చేశాం. నేడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించాం. గిరిజనులకు ఇంకా రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. గిరిజన తండాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. అరకు కాఫీ పంటను మరింత అభివృద్ధి చేసి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న. మీరు అధికారంలోకి వస్తే జీవో నెంబర్.3ని అమలు చేస్తారా?
లోకేశ్: గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని చంద్రబాబు జీవో నెంబర్.3 తెచ్చారు. దీన్ని కొంత మంది కోర్టులో చాలెంజ్ చేస్తే వైసీపీ ప్రభుత్వం కనీసం దీన్ని కోర్టులో వాదించేందుకు చొరవ తీసుకోలేదు. ఐటీడీఏ నిధులు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. మేం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
తాటి మల్లేశ్: రాష్ట్ర విభజన తర్వాత 3 సంవత్సరాల పాటు లోకల్, నాన్ లోకల్ అనే పేరుతో మేం ఉద్యోగాలు కోల్పోయాం. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు?
లోకేశ్: మేం అధికారంలో ఉండగా బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశాం. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఉద్యోగాలను క్రమ పద్ధతిలో భర్తీ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేం టార్గెట్ పెట్టుకున్నాం. ఉద్యోగాలు రావడం ఆలస్యమైతే ప్రతినెల రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇచ్చి అండగా నిలబడతాం.
బొడియం శ్రీనివాసరావు: మీరు అధికారంలోకి వచ్చాక ఏమేం చేస్తారు?
లోకేశ్: నేను జగన్మోహన్ రెడ్డిలా ఊరికో మాట చెప్పే రకం కాదు. మేం చేయగలిగేవే చెబుతాం. చేయలేని వాటిపై హామీలు ఇవ్వం. పోలవరం నిర్వాసితులపై గతంలో మేం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం.
నిర్వాసితులకు రావాల్సిన డబ్బులను అధికారపార్టీకి చెందిన వాళ్లు తమ బంధువులకు ఇప్పిస్తున్నారు. దీనిపై సిట్ వేసి నిందితులను శిక్షిస్తాం. బోగస్ గిరిజన సర్టిఫికెట్లను అరికట్టేందుకు డీఎల్ఎస్ఏ ను బలోపేతం చేస్తాం. బోయలను ఎస్టీల్లో చేర్చే అంశంపై గిరిజనులు, బోయలతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి గిరిజనులకు అన్యాయం జరగకుండా చూస్తాం.
వెంకటప్ప: మీరు పాదయాత్రలో గిరిజనులను అనేక మందిని మీరు కలిశారు. మా విధానాలు, పద్ధతుల గురించి మీరు ఏమైనా తెలుసుకున్నారా?
లోకేశ్: గిరిజనులు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. అవసరం అనుకుంటే ఎంతకైనా మీరు తెగిస్తారు. మీరు నాపై చూపుతున్న ప్రేమ, శ్రద్ధకు నేను కృతజ్ఞుడను. మీలో ఉన్న పట్టుదలకు నేను ఆశ్చర్యపడ్డాను.
దుర్గాభవాని: గత ప్రభుత్వంలో డీఎస్సీ భర్తీ, ఎస్టీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారు. నేడు ఇవేమీ చేపట్టడం లేదు. మీరు అధికారంలోకి వస్తే వీటి భర్తీ చేపడతారా?
లోకేశ్: 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి యేడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఓ పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అసలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేవు, ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారని చెబుతున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను సరిచేయాల్సి ఉంది. గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేశాం. దీనికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నాం.
పోశిరెడ్డి: 2006 అటవీ హక్కుల చట్టంలోని 15వ షెడ్యూల్ ను వైసీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని అమలు చేస్తారా?
లోకేశ్: అటవీ హక్కుల చట్టాన్ని అధ్యయనం చేస్తాం. గిరిజనులకు ఉపయోగపడే అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని తు.చ. తప్పకుండా అమలు చేస్తాం. అటవీ ప్రాంతంలో గిరిజనులను తిరగనిచ్చే పరిస్థితులు కూడా వైసీపీ పాలనలో లేవు. మేం అధికారంలోకి వచ్చాక గిరిజన చట్టాలను అమలు చేస్తాం.
గంగరాజు, కిచ్చగూడెం: మీరు అధికారంలోకి వస్తే ఐటీడీఏలోకి మా గ్రామాలను చేరుస్తారా?
లోకేశ్: అర్హత ఉండి ఐటీడీఏ పరిధిలో లేని గ్రామాలను అధ్యయనం చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ప్రాంతాన్ని ఐటీడీఏ పరిధిలోకి చేరుస్తాం.
*యువగళం పాదయాత్ర వివరాలు*
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2710 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 20 కి.మీ.*
*201వరోజు యువగళం వివరాలు*
*గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*
ఉదయం
8.00 - పొంగుటూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – పాదయాత్ర గోపాలపురం అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.
8.40 – పోతవరంలో స్థానికులతో మాటామంతీ.
10.00 – పోతవరం ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్ద స్థానికులతో మాటామంతీ.
10.45 – పోతవరం సెంటర్ లో రైతులతో సమావేశం.
11.30 – కావులూరులో స్థానికులతో సమావేశం.
మధ్యాహ్నం
12.30 - చీపురుగూడెంలో ఎలక్ట్రికల్ వర్కర్లతో సమావేశం.
1.30 – నల్లజర్ల శివార్లలో గీతకార్మికులతో ముఖాముఖి.
2.30 – నల్లజర్ల శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – నల్లజర్ల శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – నల్లజర్ల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆటోయూనియన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
6.30 – ప్రకాశరావుపాలెంలో స్థానికులతో మాటామంతీ.
రాత్రి
7.00 – ప్రకాశరావుపాలెంలో దళితమహిళలతో సమావేశం.
9.30 – ప్రకాశరావుపాలెం శివారు విడిది కేంద్రంలో బస.
*****