Vijay joseph: సేవ సంస్థనే రాజకీయ పార్టీగా మార్చబోతున్న స్టార్ హీరో విజయ్!

Star hero Vijay is planning to turn the service organization into a political party

  • రాబోయే లోక్ సభ  ఎన్నికల్లోపే విజయ్ రాజకీయ ప్రవేశం
  • విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ సంస్థ కార్యకలాపాలు విస్తృతం
  • లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్

ప్రముఖ తమిళ నటుడు, దక్షిణాదిలో పాప్యులారిటీ ఉన్న విజయ్‌ జోసెఫ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ కంటే ముందే ఆయన పార్లమెంట్ బరిలోకి దిగనున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోపే రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సమాజ సేవ కోసం స్థాపించిన తన విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో పది, ఇంటర్, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లాలవారీగా ఉపకార వేతనాలు అందించారు. సంస్థ నిర్వాహకులతో ఈ మధ్య విజయ్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఏర్పాటు దిశగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు సంస్థ కార్యకలాపాలను క్షణాల్లో చేర్చే దిశగా సోషల్ మీడియా, ఐటీ విభాగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించారు. 

సంస్థలో సాంకేతిక విభాగం సభ్యుల సంఖ్యను 30 వేలకు పెంచాలని కూడా నిర్ణయించారు. అలాగే, విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌కు ప్రస్తుతం 1600 వాట్సప్‌ గ్రూపులు పనిచేస్తున్నాయి. వీటి సంఖ్యను నెల రోజుల్లోనే 10 వేలకు పెంచాలని విజయ్ ఆదేశించారు. గతంలో నటుడు విజయకాంత్‌ తన అభిమానుల సంఘాలను సమైక్యపరిచేందుకు ఇదేవిధంగా సోషల్ మీడియాను వాడుకున్నారు. విజయ్‌కాంత్‌ బాటలోనే నటుడు విజయ్‌ కూడా రాజకీయ ప్రవేశానికి ఇలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ తప్పకుండా బరిలోకి దిగుతుందని అంటున్నాయి. కాగా, విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News