Mallu Bhatti Vikramarka: అందుకే షర్మిల కొంతకాలం కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు!: మల్లు భట్టివిక్రమార్క
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత
- షర్మిల సొంతింటికి వచ్చినట్లుగా భావిస్తామని వెల్లడి
- షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవన్న భట్టి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీలో చేరితే సొంతింటికి వచ్చినట్లుగా భావిస్తామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తన పాదయాత్ర విజయవంతం కావడంతో తనకు సహకరించిన వారితో కలిసి ఆయన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఎవరికీ అభ్యంతరాలు ఉండవని,ఆమె సొంతింటికి వచ్చినట్లుగా భావిస్తామని అన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబమే అన్నారు. ఇటీవలే షర్మిల తమ పార్టీ పెద్దలను కలిశారని గుర్తు చేశారు. కొద్దిగా భావోద్వేగాల వల్ల కొంతకాలం వారు పార్టీకి దూరంగా ఉన్నారన్నారు.
నిన్న ఇడుపులపాయలోనూ మల్లు భట్టి స్పందించారు. షర్మిల పార్టీలోకి వస్తే ఆహ్వానించాల్సిందే అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన జీవితం మొత్తం కాంగ్రెస్‌కు ధారపోశారన్నారు. అలాంటి నాయకుడి బిడ్డ తమ పార్టీలోకి వస్తే మంచి పరిణామమే అన్నారు.