Chandrababu: సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. నేతల అభినందనలు
- 1995 సెప్టెంబర్ 1న తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు
- ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి అభినందనలు తెలిపిన నేతలు
- ఉమ్మడి ఏపీకి సంపదను సృష్టించారంటూ కితాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నేతలు శుక్రవారం అభినందనలు తెలిపారు. 1995 సెప్టెంబర్ 1న ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్లో పలువురు నేతలు ఆయనను కలిసి జ్ఞాపికను అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంపదను సృష్టించారని కితాబునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఈ సందర్భంగా టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు.
కాగా, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇరవై ఎనిమిదేళ్ళు అయిన సందర్భంగా టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతా కూడా ట్వీట్ చేసింది. '1995 సెప్టెంబర్ 1న
చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 'ప్రజలవద్దకు పాలన, 'జన్మభూమి', 'ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు', పచ్చదనం పరిశుభ్రత' వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి రోజుకు పద్దెనిమిది గంటలు తాను కష్టపడడంతో పాటు ఇతరులలోనూ కష్టపడే తత్త్వాన్ని పెంపొందించారు' అని ట్వీట్ చేసింది.
సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా చంద్రబాబు నిలిచారని, గ్లోబల్ లీడర్లుగా తెలుగువారిని ప్రపంచం ఎదుట నిలబెట్టారని, వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఐదు కోట్ల ఆంధ్రులు కోరుతున్నారని పేర్కొంది.