jagityal: దీప్తి హత్య కేసు: ప్రియుడితో పారిపోయే సమయంలో అక్కను హత్య చేసిన చందన?
- చందన, బాయ్ ఫ్రెండ్, తదితరులను ఒంగోలులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అరెస్టైన వారిలో బాయ్ ఫ్రెండ్, ప్రియుడి తల్లి, కారు డ్రైవర్
- ఒంగోలు నుండి జగిత్యాలకు తీసుకువచ్చి విచారణ
సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన టెక్కీ దీప్తి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన అక్క దీప్తిని హత్య చేసినట్లు సోదరి చందన అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
చెల్లి చందన ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చందన డబ్బులు, బంగారం తీసుకొని తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో దీప్తి అడ్డుకుంది. ఈ సమయంలో దీప్తి ముక్కుకు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి పారిపోయినట్లుగా చందన అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి చందన, ఆమె బాయ్ ఫ్రెండ్, ప్రియుడి తల్లి, అతని తరఫున ఓ బంధువు, కారు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. నిందితులను ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకాలో పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలులోని ఓ లాడ్జిలో వారిని పట్టుకొని జగిత్యాల పోలీసులకు అప్పగించారు. నిందితులను తెలంగాణ పోలీసులు ఒంగోలు నుండి జగిత్యాలకు తీసుకు వచ్చి విచారించారని తెలుస్తోంది.
జగిత్యాల పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి కేసును కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. తమకు గత నెల 29న ఉదయం దీప్తి మృతి చెందినట్లు ఫిర్యాదు అందిందని, కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ చేపట్టామని, ఐదు టీమ్‌లను ఏర్పాటు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు పురోగతి దశలో ఉందని, అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందన్నారు.