Balaveeranjaneya Swami: వైద్య విద్యతోనూ వ్యాపారమా జగన్ రెడ్డీ?: టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఆగ్రహం

TDP MLA Swami take a jibe at CM Jagan over MBBS seats issue

  • ఎంబీబీఎస్ సీట్లను జగన్ అమ్ముకుంటున్నాడన్న బాలవీరాంజనేయస్వామి
  • అధికారంలోకి రాగానే బడుగులకు వైద్య విద్యను దూరం చేశాడని ఆగ్రహం
  • సీట్ల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను జగన్ రెడ్డి ప్రభుత్వం సంతలో సరుకుల్లా అమ్మకానికి పెట్టడం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్యే (కొండపి) డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ఇన్నాళ్లూ కొత్త కాలేజీలు వస్తే తమ ఎంబీబీఎస్ కల నెరవేరుతుందనుకున్న బడుగు, బలహీన వర్గాల ఆశను జగన్ రెడ్డి చిదిమేశాడని మండిపడ్డారు. 

తాను పేదల పక్షమని కల్లబొల్లి మాటలు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో మాత్రం పైసలు ఇచ్చిన వారికే మెడికల్ సీట్లు కట్టబెట్టడం పెత్తందారీ ఆలోచన కాక మరేమిటి? అని స్వామి విమర్శించారు. 

"మీ పిల్లలను డాక్టర్, ఇంజనీర్ ఏది చదివించినా ఫీజు తానే కడతానని ప్రతిపక్షంలో గొంతు చించుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే బడుగులకు వైద్య విద్య దూరం చేయడం మాట తప్పి మడమ తిప్పడం కాదా? 

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సైతం 'ఏ' కేటగిరీ సీట్లను రిజర్వేషన్ ప్రాతిపదికన ఇస్తుంటే... ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆ సదుపాయం ఎత్తేసి పేదలకు జగన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. జగన్ రెడ్డి ధన దాహానికి కొత్తగా వచ్చిన 750 ఎంబీబీఎస్ సీట్లలో 168 సీట్లను పేద విద్యార్థులు కోల్పోతున్నారు. 

ఏపీ కంటే చైనా, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఎంబీబీఎస్ చదవడం చౌక. అక్కడ ఎంబీబీఎస్ చదువుకు ఏడాదికి రూ. 5 లక్షలయితే మన రాష్ట్రంలో రూ.1 కోటి వరకూ ఖర్చవుతుంది. అంత డబ్బు కట్టి ఎంబీబీఎస్ చదవడం పేదల వల్ల అయ్యే పనేనా? పేదవాళ్లు చదువుకుని బాగుపడితే నువ్వు చూడలేవా జగన్ రెడ్డీ? సీట్ల అమ్మకం వద్దని జూనియర్ డాక్టర్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం కాదా?

నాడు-నేడు కింద వైద్య రంగం అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా సీట్ల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి" అంటూ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి గట్టిగా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News