G. Kishan Reddy: ముందు ముందు బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు: కిషన్ రెడ్డి
- గజ్వేల్ వెళ్తోన్న బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి ఆగ్రహం
- ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
- గజ్వేల్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి ఉంటే భయమెందుకని ప్రశ్న
ముందు ముందు బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుల సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రయివేటు ఆస్తి కాదన్నారు. శుక్రవారం కామారెడ్డి నుండి గజ్వేల్ వెళ్తోన్న బీజేపీ నేత రమణారెడ్డి, కార్యకర్తలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. గతంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ఆ బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
కామారెడ్డి నేతలు గజ్వేల్‌కు వెళ్తామంటే కేసీఆర్ ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తే భయమెందుకన్నారు. గజ్వేల్‌ను కేసీఆర్‌కు నిజాం రాసిచ్చాడా? లేక ఓవైసీ రాసిచ్చాడా? అని ఎద్దేవా చేశారు. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే బీజేపీ ఊరుకోదన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు రైతులు తమ బలం చూపిస్తారన్నారు. ఈ ప్రభుత్వంలో అన్నింటా కమీషన్లు, వాటాలు తీసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ కమీషన్ ప్రభుత్వం అయితే, బీఆర్ఎస్ వాటాల ప్రభుత్వమన్నారు.