Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలు ఇస్తుండగా మటన్ వండిన రాహుల్ గాంధీ..!

Rahul Gandhi shares video of preparing Champaran mutton with RJD supremo Lalu
  • ‘ఇండియా’ కూటమి నేతలు రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య సరదా సన్నివేశం
  • రాహుల్‌కు మటన్ వండటంపై మెళకువలు నేర్పిన లాలూ
  • అన్ని కలిస్తే గానీ రాజకీయాలు సాధ్యం కావని చమత్కారం
  • బీజేపీపై మండిపాటు, కాషాయపార్టీకి ‘రాజకీయ ఆకలి’ ఎక్కువని వ్యాఖ్య
అదో స్పెషల్ ట్రెయినింగ్ సెషన్.. శిక్షణ ఇస్తున్నది ఆర్‌జేడీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్! ఆయనను చూసి కొత్తమెళకువలు నేర్చుకుంటున్నది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ! మటన్ ఎలా వండాలో చేసి మరీ చూపించారు లాలూ..! ఉల్లిపాయలు, వెల్లుల్లి, రకరకాల మసాలా దినుసులు తగు పాళ్లల్లో వేసి ఘుమఘుమలాడే వంటకాన్ని రెడీ చేయించారు. లాలూ పాకశాస్త్ర ప్రావీణ్యం చూసి రాహుల్ గాంధీ ఆశ్చర్యపోయారు. ఎన్నికల వేళ ఇద్దరు నేతలూ బిజీబిజీగా గడిపేస్తున్న నేపథ్యంలో శనివారం లాలూ ఇంట ఈ సరదా సన్నివేశం ఆవిష్కృతమైంది. ట్విట్టర్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

‘‘నాకు వంట వచ్చు గానీ నేను ఎక్స్‌పర్ట్‌ని మాత్రం కాదు. ఐరోపాలో ఒంటరిగా ఉండేటప్పుడు వంట నేర్చుకోవాల్సి వచ్చింది. చిన్న చిన్న వంటకాలను చేయగలను. కానీ ఎక్స్‌పర్ట్ మాత్రం కాదు. లాలూ గారు మాత్రం అద్భుతంగా వంట చేస్తారు’’ అని రాహుల్ గాంధీ కితాబిచ్చారు. అద్భుతంగా వంట వచ్చిన భారత రాజకీయనేతల్లో లాలూ ముందుంటారని పేర్కొన్నారు. 

తాను ఆరు, ఏడు తరగతుల్లో ఉండగా వంట నేర్చుకున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ‘‘నా సోదరులను కలిసేందుకు పట్నా వెళ్లా. వాళ్లు అక్కడే పనిచేసేవారు. వాళ్లే నన్ను అక్కడికి పిలిపించారు. అక్కడ వాళ్లకు నేనే వంట వండేవాణ్ణి. వంటచెరకు సేకరించడం, అంట్లు తోమడం, మసాలా నూరడం..అన్నీ అక్కడే నేర్చుకున్నా’’ అని లాలూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. 

ఈ వీడియోలో రాహుల్ గాంధీకి మటన్ ఎలా వండాలో చెబుతూ లాలూ పలు సూచనలు చేశారు. మటన్‌ను కలపడం, మసాలా జోడించడం..ఇలా అన్ని విషయాలూ వివరించారు. 

మటన్ రెడీ అవుతున్న సమయంలో రాహుల్, లాలూ మధ్య ఆసక్తికర సంవాదం కొనసాగింది. రాజకీయాలకు సంబంధించి సీక్రెట్ మసాలా ఏంటని రాహుల్ ప్రశ్నించగా కష్టించి పనిచేయడమేనని లాలూ జవాబిచ్చారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. పాలిటిక్స్‌లో కూడా అన్నీ కలిపేయడం లాలూకు అలవాటు అంటూ జోక్ చేసిన రాహుల్ గాంధీ.. వంటకు, రాజకీయాలకు మధ్య తేడా ఏమిటని లాలూను ప్రశ్నించారు. ‘‘అవును..నేను అదే చేస్తా. అయితే, కాస్తంత కలపకుండా రాజకీయాలు సాధ్యం కావు’’ అంటూ లాలూ చమత్కరించారు. 

మునుపటి నేతలు దేశాన్ని ఓ కొత్త, న్యాయబద్ధమైన మార్గంలో నడిపించారని, ఆ విషయాన్ని యువ నేతలు మర్చిపోకూడదని లాలూ అభిప్రాయపడ్డారు. రాహుల్‌తో పాటూ అక్కడ బీహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, సోదరి మీసా భారతి కూడా ఉన్నారు. బీజేపీపై కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి ‘రాజకీయ ఆకలి’ ఎక్కువని విమర్శించారు.
Lalu Prasad Yadav
I.N.D.I.A
Rahul Gandhi
Congress
RJD

More Telugu News