Mynampally Hanumanth Rao: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నా.. వచ్చాకే నిర్ణయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి
- కేసీఆర్ చెబితేనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న మైనంపల్లి
- తానెప్పుడూ పార్టీ గీత దాటి ప్రవర్తించలేదని స్పష్టీకరణ
- తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనన్న హన్మంతరావు
ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితేనే తాను తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, ఇప్పుడేమో టికెట్ ఇవ్వనంటే ఎలా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రశ్నించారు. మల్కాజిగిరిలో నిన్న ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. తానెప్పుడూ పార్టీ గీత దాటి ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు.
మేడ్చల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో తన కుమారుడిని చూసిన సీఎం కేసీఆర్ రాజకీయాల్లోకి తీసుకురమ్మని తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. సీఎం ప్రోత్సాహంతోనే మెదక్లో తన కుమారుడు మైనంపల్లి సేవా సంస్థ తరపున ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు. తాను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనానికి వెళ్తున్నానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని మైనంపల్లి ప్రకటించారు.