Revanth Reddy: రాష్ట్రాల హక్కులు హరించడానికే జమిలి ఎన్నికలు: రేవంత్ రెడ్డి
- ఓడిపోతామనే జమిలి ఎన్నికలు ముందుకు తెచ్చారన్న రేవంత్ రెడ్డి
- జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని వెల్లడి
- జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమని వ్యాఖ్యలు
- కేసీఆర్ లేఖ కూడా రాశారని స్పష్టీకరణ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. కర్ణాటకలో నరేంద్ర మోదీ, అమిత్ షా 30 రోజులు ప్రచారం చేసినా బీజేపీ గెలవలేకపోయిందని అన్నారు. బీజేపీ మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని జోస్యం చెప్పారు.
ఓడిపోతామనే జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉందని అన్నారు. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ కేసీఆర్ 2018లో లేఖ కూడా రాశారని రేవంత్ వెల్లడించారు.
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులు హరించడానికే జమిలి ఎన్నికలు అని మండిపడ్డారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాదు... వన్ పార్టీ-వన్ పర్సన్ అనేదే బీజేపీ విధానం అని విమర్శించారు.