Revanth Reddy: అభ్యర్థులను అధిష్ఠానమే ఫైనల్ చేస్తుంది: రేవంత్ రెడ్డి
- ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం
- అభ్యర్థులకు టికెట్లు ప్రకటించే అధికారం తమకు లేదన్న రేవంత్
- కాండిడేట్ల ఎంపిక పూర్తిగా పారదర్శకమని వెల్లడి
- బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నామని వివరణ
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అభ్యర్థులను అధిష్ఠానమే ఖరారు చేస్తుందని వెల్లడించారు. టికెట్లు ప్రకటించే అధికారం రాష్ట్ర నేతలకు లేదని రేవంత్ స్పష్టం చేశారు. పీఈసీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సీల్డ్ కవర్ లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని వివరించారు.
స్క్రీనింగ్ కమిటీ మూడ్రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటుందని, రేపు పీఈసీ సభ్యులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందని వెల్లడించారు. ఎల్లుండి డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమై నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందని వివరించారు. ఆ తర్వాతే కేంద్ర ఎన్నికల కమిటీకి అభ్యర్థుల జాబితా చేరుతుందని రేవంత్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా వెల్లడవుతుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకం అని పేర్కొన్నారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నట్టు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో అపోహలకు గురికావొద్దని అన్నారు.
కేసీఆర్ కు దిమ్మదిరిగే వ్యూహం తమ వద్ద ఉందని రేవంత్ అన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని పేర్కొన్నారు.