Breast Milk: తల్లి పాలతో పిల్లల ఐక్యూ పెరుగుతోంది!
- అమెరికాలోని కన్సాస్ వర్సిటీ అధ్యయనకారుల వెల్లడి
- 12 నెలల పాటు చిన్నారులపై పరిశోధన
- మెదడు నిర్మాణంలో తల్లి పాలలో ఉండే మిల్క్ ఫ్యాట్ గ్లోబ్యూల్ మెంబ్రేన్ కీలకమని వివరణ
తల్లి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయని, పిల్లల ఎదుగుదలలో అవి కీలకమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తాజాగా పిల్లల మెదడు నిర్మాణంలోనూ తల్లి పాలే ముఖ్యమని మరో అధ్యయనం తేల్చింది. దీర్ఘకాలంలో పిల్లల్లో విషయగ్రహణ సామర్థ్యం మెరుగుపరుస్తుందని వెల్లడైంది. మెదడు నిర్మాణంలో, పనితీరులో కీలకమైన మిల్క్ ఫ్యాట్ గ్లోబ్యూల్ మెంబ్రేన్ (ఎంఎఫ్ జీఎం), ల్యాక్టోఫెరిన్ లు తల్లి పాలలో పుష్కలంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీ అధ్యయనకారులు 12 నెలల పాటు చిన్నారులపై పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని గుర్తించారు.
పరిశోధనలో భాగంగా మిల్క్ ఫ్యాట్ గ్లోబ్యూల్ మెంబ్రేన్, ల్యాక్టోఫెరిన్ లను ఆహారంలో కలిపి చిన్నారులకు అందించారు. ఇలా ఏడాది పాటు ఇచ్చి, పిల్లలకు ఐదున్నరేళ్లు వచ్చాక వారి ఐక్యూను పరీక్షించారు. మిగతా పిల్లలతో పోలిస్తే ఎంఎఫ్ జీఎం, ల్యాక్టోఫెరిన్ లు తీసుకున్న పిల్లల ఐక్యూ దాదాపు 5 పాయింట్లు మెరుగుపడినట్లు గుర్తించారు. అంతేకాదు, తనకు అందిన సమాచారాన్ని మెదడు ప్రాసెస్ చేసే వేగం కూడా పెరిగిందని ఈ పరిశోధనలో పాల్గొన్న జాన్ కొలంబో చెప్పారు.
చిన్నతనంలో పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెదడు నిర్మాణం, పనితీరు మెరుగుపడుతుందని ఈ పరిశోధన ద్వారా నిర్ధారణ అయిందని జాన్ వివరించారు. కాగా, తల్లి పాలతో పాటు జంతువుల పాలల్లో ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ సహా పలు పోషకాలతో కూడిన పొర ఉంటుందని తెలిపారు. పాలతో వివిధ పదార్థాలను తయారుచేసే క్రమంలో ఈ పొరను తొలగిస్తున్నారని జాన్ చెప్పారు.