USA: జీ 20 మీటింగ్ కు జిన్ పింగ్ డుమ్మా..? బైడెన్ ఏమన్నారంటే..!

Disappointed says Biden On Reports That Xi May Skip India G20 Summit
  • జిన్ పింగ్ హాజరుకాబోరంటూ ప్రచారం
  • నిరాశ కలిగించిందంటూ బైడెన్ వ్యాఖ్య
  • త్వరలోనే తామిద్దరమూ కలుస్తామని వెల్లడి
భారతదేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాబోరంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్న పలువురు అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. జిన్ పింగ్ హాజరుపై సందేహాలు నెలకొన్నాయని, ఇప్పటి వరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని చెప్పారు. 

భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జిన్ పింగ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. జిన్ పింగ్ హాజరు కావడంలేదన్న వార్త తనను నిరాశకు గురిచేసిందని బైడెన్ అన్నారు. అయితే, త్వరలోనే జిన్ పింగ్ ను కలుస్తానని ఆయన వివరించారు. ఎక్కడ, ఎప్పుడు కలుస్తారనే వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. డెలావేర్ లో విలేకరులతో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

చివరిసారిగా ఈ ఇద్దరు నేతలు బాలిలో నిర్వహించిన జీ20 సదస్సులో కలుసుకున్నారు. ఆ తర్వాత చైనా నిఘా బెలూన్ ఒకటి అమెరికా గగనతలంపై ఎగరడం, యుద్ధ విమానాలను పంపించి అమెరికా దానిని కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు కలుసుకోలేదు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు కలుసుకుంటారని అంతా భావించారు. అయితే, జిన్ పింగ్ హాజరుపై సందేహాలు రేకెత్తడంతో బైడెన్ స్పందిస్తూ జిన్ పింగ్ ను త్వరలోనే కలుస్తానని పేర్కొన్నారు.
USA
president of america
G20 Summit
Joe Biden

More Telugu News