Apple Watch: రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడిన ఆపిల్ వాచ్
- అమెరికాలో ఘటన
- గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం
- రోడ్డుపై బోల్తా పడిన వాహనం
- అపస్మారక స్థితిలో డ్రైవర్
- 911కు సమాచారం పంపిన ఆపిల్ వాచ్
గతంలో ఓసారి ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యే ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఆపిల్ వాచ్... ఆ వ్యక్తిని అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పిన ఘటన చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఆపిల్ వాచ్ మరోసారి ప్రాణాపాయాన్ని నివారించింది.
ఆపిల్ వాచ్ లో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. ఇందులోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తాజాగా ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది. వాచ్ ధరించిన వ్యక్తి నోటిఫికేషన్ కు స్పందించని పక్షంలో, వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ కు వాచ్ నుంచి కాల్ వెళుతుంది.
అమెరికాలోని విస్కాన్సిన్ లో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై బోల్తా కొట్టింది. గురువారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో ఆపిల్ వాచ్ ధరించి ఉండడం అతడి అదృష్టం అనుకోవాలి.
ఆపిల్ వాచ్ లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయి... రోడ్డు ప్రమాద సమాచారాన్ని 911 ఎమర్జెన్సీ సర్వీస్ కు చేరవేసింది. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని హెలికాప్టర్ ద్వారా ఆ డ్రైవర్ ను తరలించారు. సకాలంలో అతడిన ఆసుపత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దీనిపై రెస్క్యూ డిపార్ట్ మెంట్ అధికారి మాట్లాడుతూ, ఆపిల్ వాచ్ నుంచి కాల్ రావడంతో తాము వెంటనే వెళ్లగలిగామని, లేకపోతే, అతడి ప్రమాద సమాచారం ఎప్పటికో తెలిసేదని, తాము వెళ్లేసరికి ఆలస్యం అయ్యుండేదని వివరించారు.