Kerala High Court: తల్లిదండ్రులతో వెళ్లేందుకు ప్రియురాలి మొగ్గు.. కేరళ హైకోర్టులో మణికట్టు కోసుకున్న యువకుడు
- నెల రోజులుగా కలిసి ఉంటున్న యువతీయువకులు
- అతడిపై తనకు సోదరభావం తప్ప రొమాంటిక్ ఫీలింగ్స్ కలగడం లేదన్న యువతి
- బెదిరించడం వల్లే అతడితో కలిసి ఉన్నానని కోర్టుకు స్పష్టీకరణ
ప్రియురాలు తల్లిదండ్రులతో వెళ్లేందుకు మొగ్గు చూపడంతో కేరళ హైకోర్టులో ఓ యువకుడు మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్రిసూర్ జిల్లాకు చెందిన విష్ణు (31).. 23 ఏళ్ల యువతితో నెల రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. యువతి తండ్రి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ నేపథ్యంలో పోలీసులు వీరిద్దరినీ నిన్న హైకోర్టులో హాజరు పరిచారు.
ఈ సందర్భంగా జరిగిన విచారణలో యువతి తల్లిదండ్రలతో వెళ్లేందుకు మొగ్గుచూపింది. తాను తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్తానని జస్టిస్ అను శివరామన్, సి. జయచంద్రన్లతో కూడిన ధర్మాసనానికి తెలిపింది. విష్ణును చూస్తే తనకు సోదరభావం తప్ప రొమాంటిక్ ఫీలింగ్స్ కలగడం లేదని స్పష్టం చేసింది. అతడు తనను బెదిరించడం వల్లనే కలిసి ఉన్నానని చెప్పింది.
విష్ణుకు ఇప్పటికే వివాహమైందని అయితే, అది చెడిపోయిందని చెప్పి మోసం చేసినట్టు ఆమె కోర్టుకు తెలిపింది. విచారణ తర్వాత విష్ణు జేబులోంచి కత్తి తీసి కోర్టు హాలులోనే మణికట్టు కోసుకున్నాడు. దీంతో అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.