TTD: గోవింద కోటి రాసిన యువతకు, వారి కుటుంబ సభ్యులకు వీఐపీ దర్శనాలు... టీటీడీ కీలక నిర్ణయం
- నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
- ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్న చైర్మన్ భూమన
- యువతలో సనాతన ధర్మం పట్ల అనురక్తి కల్పించే చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి
ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోవింద నామాన్ని కోటి పర్యాయాలు రాసిన యువతకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శన సదుపాయం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
యువతీయువకుల్లో సనాతన ధర్మం పట్ల అనురక్తి కలిగించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని బోర్డు భావిస్తోంది. అందుకే చిన్న పిల్లల నుంచి పాతికేళ్ల లోపు వారిని గోవింద కోటి రాసేలా ప్రోత్సహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన తెలిపారు.
పాలకమండలి తీసుకున్న ఇతర నిర్ణయాలను కూడా భూమన మీడియాకు తెలిపారు. తిరుపతిలో పాత సత్రాలను తొలగించి, అధునాతనమైన రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. అచ్యుతం, శ్రీ పథం పేరిట ఒక్కో అతిథి గృహానికి రూ.300 కోట్లు కేటాయించి నిర్మాణం చేపడతామని వివరించారు.
భైరాగి పట్టడి, కేశవాయన గంటా ప్రాంతాల్లో రహదారుల ఆధునికీకరణకు రూ.135 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. టీటీడీలో 413 ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని భూమన వెల్లడించారు.
47 వేద అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో 300 ఉద్యోగాలకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. 29 మంది స్పెషలిస్టులు, 15 మంది డాక్టర్ల నియామకం చేపడుతున్నట్టు చెప్పారు.
ముంబయిలోని బాంద్రాలో వెంకటేశ్వరస్వామి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించినట్టు భూమన తెలిపారు. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్టోబరులో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు.