Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కు బీసీసీఐ 'గోల్డెన్ టికెట్'
- టీమిండియాకు గట్టి మద్దతుదారుగా పేరున్న అమితాబ్
- టీమిండియాను ఎవరైనా తప్పుగా విమర్శిస్తే ఊరుకోని బిగ్ బి
- అమితాబ్ ను విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ
- స్వయంగా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ కార్యదర్శి జై షా
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు వీరాభిమాని అని తెలిసిందే. టీమిండియా ఆడే మ్యాచ్ లు, సిరీస్ లను ఆయన క్రమం తప్పకుండా అనుసరిస్తుంటారు. అంతేకాదు, టీమిండియాను ఎవరైనా తప్పుగా విమర్శిస్తే వారిని ఓ చూపు చూస్తుంటారు.
ఈ నేపథ్యంలో, అమితాబ్ బచ్చన్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విశిష్ట రీతిలో గౌరవించింది. ఆయనకు వరల్డ్ కప్-2023 గోల్డెన్ టికెట్ ను ప్రదానం చేసింది. ఈ గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా... అమితాబ్ కు స్వయంగా అందించారు. దీనిపై బీసీసీఐ ఎక్స్ లో స్పందించింది.
"మన గోల్డెన్ ఐకాన్ కు గోల్డెన్ టికెట్ ఇస్తున్నాం. ఈ శతాబ్దపు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ అందించే భాగ్యాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా దక్కించుకున్నారు. లెజెండరీ నటుడు, క్రికెట్ కు వీరాభిమాని అయిన అమితాబ్ బచ్చన్ టీమిండియాకు అందించే అచంచల మద్దతు ఇకపైనా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తున్నాం. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో అమితాబ్ కూడా పాలుపంచుకుంటుండడం పట్ల ఉద్విగ్నతకు లోనవుతున్నాం" అంటూ బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
కాగా, బీసీసీఐ ప్రదానం చేసిన గోల్డెన్ టికెట్ ఒక రకంగా వీఐపీ పాస్ వంటిది. దీని సాయంతో వరల్డ్ కప్ సందర్భంగా ఏ మ్యాచ్ కైనా హాజరై, వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్ ను వీక్షించే వీలుంటుంది.