Telangana: తెలంగాణలో మరో 5 రోజులు కుండపోత వర్షాలే
- తెలంగాణను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు
- రాష్ట్రంలో ఇప్పటికే 20 శాతం అధిక వర్షపాతం నమోదు
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ వర్షాకాలంలో 20 శాతం అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీ కాగా... ఇప్పటి వరకు 723.1 మి.మీ వర్షపాతం నమోదయిందని వెల్లడించింది.