Bandi Sanjay: ఉదయనిధి వ్యాఖ్యలపై నిఖార్సైన హిందువు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు: బండి సంజయ్

Bandi Sanjay says Why KCR not responding on Udayanidhi Maran comments
  • సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించిన కరీంనగర్ ఎంపీ
  • ఔరంగజేబు మొదలు బ్రిటిష్ వాళ్ల వరకు కనుమరుగయ్యారన్న బండి సంజయ్
  • నుపుర్ శర్మ, రాజాసింగ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే చంకలు గుద్దుకున్నారని ఆగ్రహం
  • ఉదయనిధి మాటలపై I.N.D.I.A వైఖరి చెప్పాలని డిమాండ్
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ తమిళ మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, ఇటలీ ఇండియా కూటమి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ఉదయనిధి చెబితే వినాల్సిన ఖర్మ దేశ ప్రజలకు లేదన్నారు.

సనాతన ధర్మం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని అంతమొందించాలని ప్రయత్నించినవాళ్లు సమాధుల్లో ఉన్నారన్నారు. ఔరంగజేబు మొదలు బ్రిటిష్ వాళ్ల వరకు కనుమరుగయ్యారన్నారు. నుపుర్ శర్మ, రాజాసింగ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే చంకలు గుద్దుకున్న పార్టీలు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. గతంలో ఉదయనిధి తాత కరుణానిధి 'రాముడు ఇంజనీరా?' అని మాట్లాడారని, ఇప్పుడు మనవడు సనాతర ధర్మాన్ని అంతమొందిస్తానని అంటున్నాడని మండిపడ్డారు.

సనాతన ధర్మం గురించి మాట్లాడింది సోనియాగాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా ఒక్కటేనని, ఉదయనిధి మాటలపై I.N.D.I.A కూటమి తమ వైఖరి ఏమిటో చెప్పాలని నిలదీశారు. I.N.D.I.A కూటమి తమ స్టాండ్ చెప్పకపోతే చరిత్రలో తప్పుచేసిన వారిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
Bandi Sanjay
udhayanidhi stalin
Tamilnadu
BJP

More Telugu News