Rishi Sunak: భారత మూలాలు నాకెంతో గర్వకారణం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
- జీ20 సమావేశాల కోసం ఈ వారం భారత్‌కు రానున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
- ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ
- భారత ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు,
- ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడి
భారత మూలాలు కలిగుండటం తనకెంతో గర్వకారణమని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు. భారత దేశం, ఇక్కడి ప్రజలతో తనకెప్పటికీ ఓ అనుబంధం ఉంటుందని చెప్పారు. భారత్‌లో జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ వారం ఆయన భారత్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైనప్పుడు భారత ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందన చూసి ఎంతో సంతోషించానని రిషి సునాక్ తెలిపారు. ‘‘నా భార్య భారతీయురాలు. ఓ హిందువుగా ఉండటం ఆమెకెంతో గర్వకారణం’’ అని వెల్లడించారు.
భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలు ఇరు దేశాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు పరిష్కరించేందుకు జీ20కి నేతృత్వం వహిస్తున్న భారత్‌తో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.
భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా రిషి స్పందించారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ఇరు దేశాల మధ్య మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇరు దేశాలకు అనుకూలమైన ప్రగతిశీల ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు.