Errabelli Dayakar Rao: కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి
- తెలంగాణ అభివృద్ధి చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శ
- కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆరోపణ
- వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
రాష్ట్రంలో దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహనీయుడు కేసీఆర్ అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కేవలం 7 గంటల ఉచిత విద్యుత్ మాత్రమే ఇచ్చేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడం చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారానికి దిగారని మండిపడ్డారు. ఈమేరకు గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రారంభించారు.
గత పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతంలో రైతులు బోర్లు వేసుకున్నా నీళ్లు పడేటివి కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మోటార్లు ఎంతసేపు నడిచినా బోర్లలో నీళ్లు అయిపోతలేవని చెప్పారు. ఇదంతా కేసీఆర్ దయవల్లేనని అన్నారు. కొంతమంది మూర్ఖులు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎందుకని, మూడు గంటలు ఇస్తే చాలని అంటున్నారు.. మూడు గంటలు ఇస్తే తనకు తెలిసి కాలువ కూడా పారదని చెప్పారు. గతంలో ఆటో నడిపే యువకుడికి, హోటల్ లో పనిచేసే కుర్రాడికి, ఖాళీగా ఉన్న యువకుడికి కూడా పిల్లను ఇచ్చే వారని, ఇప్పుడు మాత్రం పిలగానికి భూమి ఎంత ఉందని అడుగుతున్నారని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు.