Tomato: రైతును కన్నీరు పెట్టిస్తున్న టమాట

Tomato prices expected to fall after higher supplies in Telugu states

  • కిలో రూ.200 నుంచి క్వింటాల్ కు రూ.200 లకు పడిపోయిన ధర
  • మార్కెట్లో కిలో రూ.20 నుంచి రూ.30 పలుకుతున్న టమాటా
  • పత్తికొండ మార్కెట్లో కిలో రూ.2 మాత్రమే.. రవాణా ఖర్చులు రావట్లేదంటున్న రైతులు

మొన్నటి వరకూ చుక్కలను అంటిన టమాటాల ధర నేడు పాతాళానికి పడిపోయింది. కిలో రూ.200 నుంచి క్వింటాల్ రూ.200 వరకు దిగజారింది. దీంతో టమాట రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే పొలం నుంచి మార్కెట్ కు చేర్చడానికి అయిన రవాణా ఖర్చులకు కూడా గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టామాటాల ధర క్వింటాలుకు రూ.100 నుంచి రూ.200 మధ్యలో పలుకుతోంది. ఈ ధరకు అమ్ముకోలేక, పంటను నిల్వ చేసుకోలేక రైతులు విలవిలలాడుతున్నారు.

రిటైల్ మార్కెట్లలో మాత్రం కిలో టమాటాల ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో గిట్టుబాటు ధర పలకడంలేదన్నారు. ఎరువులు, సాగు, కూలీ ఖర్చుల సంగతి పక్కన పెడితే పండించిన పంట మొత్తం అమ్మినా రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. దీంతో సాగు ఖర్చులకు అదనంగా ఈ రవాణా ఖర్చుల భారానికి భయపడి కొంతమంది రైతులు టమాటాలను రోడ్లపైన పారబోస్తున్నారు. ఇంకొంతమంది రైతులు పంటను పొలాల్లో అలాగే వదిలేస్తున్నారు. కాగా, పెద్ద మొత్తంలో టమాటా నిల్వలు మార్కెట్లకు చేరడంతో ధరలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News