India: ఇండియా పేరు మార్చడంపై తెలివిగా స్పందించిన చైనా
- పేరు మార్చడం కంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉన్నాయంటూ పెదవి విరుపు
- భారత్ తన ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా? అంటూ సవాల్
- 1991 తర్వాత ప్రతిష్టాత్మక సర్కారుగా కితాబు
ఇండియా పేరును భారత్ గా కేంద్ర సర్కారు మార్చనుందంటూ వస్తున్న వార్తలపై స్వదేశంలో విపక్షాలు మండి పడుతుండగా.. పొరుగు దేశం చైనా కూడా ఇంచుమించు భారత విపక్షాల వైఖరినే ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. దేశం పేరు మార్చడం కంటే ముఖ్యమైన వేరే అంశాలు భారత్ ముందున్నాయంటూ పరోక్ష అక్కసు వెళ్లగక్కింది. చైనా సర్కారు మౌత్ పీస్ గా భావించే గ్లోబల్ టైమ్స్ లో ఈ మేరకు ఓ పెద్ద కథనమే ప్రచురితమైంది.
భారత్ జీ20 సదస్సును అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకునే అవకాశంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది. భారత్ 1947కు పూర్వం నాటి ఛాయలతో కూడిన ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా? అన్నదే కీలకమని పేర్కొంది. విప్లవాత్మకమైన సంస్కరణ లేకుండా భారత్ విప్లవాత్మకమైన అభివృద్ధిని చూడలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తన వృద్ధి చోదకంగా భారత్ మార్చుకోగలదన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘రానున్న జీ20 సదస్సుపై అంతర్జాతీయ సమాజం దృష్టి కేంద్రీకృతమైన సమయంలో, న్యూఢిల్లీ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటోంది?’’అని ప్రశ్నించింది. పేరును మార్చడం అన్నది వలసపాలన ఛాయలను తుడిచిపెట్టడంగా పేర్కొంది.
‘‘1991 తర్వాత ఆర్థిక సంస్కరణల పరంగా మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వాలలో ఒకటి. దురదృష్టవశాత్తూ ఇండియా వాణిజ్య పరంగా రక్షణాత్మక ధోరణికి మళ్లుతోంది. దేశం పేరును మార్చడం కంటే కూడా ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి’’ అని గ్లోబల్ టైమ్స్ కథనం తెలిపింది. భారత్ తన ఆర్థిక వ్యవస్థను సంస్కరించే విషయమై, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, విదేశీ ఇన్వెస్టర్లకు పారదర్శకమైన వ్యాపార వాతావరణం కల్పించడం కోసం జీ20 నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.