TS High Court: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో విద్యార్థి హరీశ్‌పై డీబార్‌ను ఎత్తేసిన హైకోర్టు
- వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రశ్నాపత్రం
- దీనికి కారకుడు అంటూ హరీశ్‌ను డీబార్ చేసిన డీఈవో
- కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి
తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన విషయంలో వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీశ్‌ను డీఈవో డీబార్ చేశారు. అయితే, అప్పటికే ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ కేసు అప్పట్లో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. దాంతో, సదరు విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో హరీశ్ పదో తరగతి పరీక్షలు రాశాడు.
అయితే పరీక్షలు పూర్తి అయి ఫలితాలు వచ్చినా అధికారులు హరీశ్ పదో తరగతి ఫలితాలను హోల్డ్‌లో పెట్టేశారు. ఫలితాలు వెళ్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును హరీశ్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం హరీశ్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అతను రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది