Perni Nani: 40 ఏళ్లలో తండ్రి పేరు కూడా చెప్పలేని చంద్రబాబు వయస్సుకు తగినట్లుగా మాట్లాడాలి: పేర్ని నాని

Perni Nani lashes out at Chandrababu Naidu
  • జగన్ తన తల్లిదండ్రుల పేర్లను లక్షసార్లు చెప్పారన్న మాజీ మంత్రి
  • తల్లిదండ్రుల గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపణ
  • రామారావు అల్లుడినని చెబుతారు తప్ప పలానా వ్యక్తి కొడుకునని ఎప్పుడూ చెప్పలేదన్న పేర్ని నాని
తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ తన తండ్రి ఎవరో ప్రపంచానికి చెప్పిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నారన్నారు. తాను వైఎస్, విజయమ్మల తనయుడినని సీఎం జగన్ గర్వంగా చెప్పుకుంటారన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి జగన్ ఓ లక్షసార్లు తన తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నారన్నారు. కానీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడానికి సిగ్గుపడే చంద్రబాబు.. జగన్ గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు ఎవరిది దౌర్భాగ్యమైన బతుకు, ఎవరిది దౌర్భాగ్యమైన స్థితో చెప్పాలన్నారు.

ఈ మధ్య చంద్రబాబు తానేదో కొత్తగా హిందూమతాన్ని పుచ్చుకున్నట్లుగా నేను హిందువును.. నేను హిందువును అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తల్లిదండ్రులు చనిపోతే తలకొరివి పెట్టనివాడు, జుట్టు తీయనివాడు చంద్రబాబు అన్నారు. ఈ రోజుకూ తాను రామారావు అల్లుడినని చెప్పుకుంటారు తప్ప... పలానా వ్యక్తి కొడుకును అని చెప్పుకోలేని వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు వంటి దుర్మార్గుడి వల్ల రాజకీయాలు భ్రష్టుపట్టాయన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాజకీయాల్లో ఉండటం కూడా అనవసరమన్నారు.

పొలాల్లో తాడిచెట్టుకు వయస్సు వస్తుందని, చెరువుగట్టున రావిచెట్టు, మర్రిచెట్టుకు కూడా వయస్సు వస్తుందన్నారు. కానీ మనం మనుషులమని గుర్తుంచుకోవాలన్నారు. కాబట్టి జగన్‌పై అక్కసుతో దిగజారుడు మాటలు మాట్లాడవద్దన్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీ జెండాను కూడా ఆయన తాకలేరన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక, ఇప్పుడు ఎన్నో హామీలు ఇస్తున్నారన్నారు. 80 ఏళ్ల ముసలి చంద్రబాబుకు ఒకటే చెబుతున్నానని... జగన్‌ను ఏమీ చేయలేక ఉక్రోషంతో దౌర్భాగ్యపు మాటలు కట్టిపెట్టాలన్నారు. కనీసం చంద్రబాబు వయస్సుకు తగిన మాటలు మాట్లాడాలని హితవు పలికారు.
Perni Nani
Andhra Pradesh
Chandrababu

More Telugu News