Yediyurappa: లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు.. 4 సీట్లకు అంగీకారం: బీజేపీ నేత యడియూరప్ప
- దేవెగౌడ ప్రధాని మోదీని కలవడం సంతోషాన్ని కలిగించిందన్న యెడ్డీ
- పొత్తు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న మాజీ ముఖ్యమంత్రి
- ఈ నిర్ణయం 26 సీట్లు గెలిచేందుకు దోహదపడుతుందని వ్యాఖ్య
2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ... జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తుతో ముందుకు సాగుతుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు చెప్పారు.
జేడీఎస్ అధినేత దేవెగౌడ ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. పొత్తులో భాగంగా జేడీఎస్‌కు నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పొత్తు నిర్ణయం తమకు బలాన్నిచ్చిందని, రాష్ట్రంలో 26 సీట్ల వరకు గెలవడానికి ఇది దోహదపడుతుందన్నారు.
ఇదిలా ఉండగా, బీజేపీ, జేడీ(ఎస్)ల మధ్య పొత్తు ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగదీశ్ శెట్టార్ స్పందించారు. తమపై గెలవలేని రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. జేడీఎస్ కనీసం ఆరు లోక్ సభ స్థానాల్లో ప్రభావితం చేయనున్న నేపథ్యంలో బీజేపీ పొత్తుకు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది.