G20 Summit 2023: ప్రపంచ నేతలను ఆహ్వానించేందుకు భారత మండపానికి చేరుకున్న మోదీ
- 10.30 గంటలకు సదస్సు ప్రారంభమయ్యే అవకాశం
- దేశాధినేతలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్
- వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్.. థీమ్‌తో నిర్వహణ
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ20 సదస్సు నేడు ప్రారంభం కానుంది. దేశరాజధాని ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ సదస్సులో వాతావరణ మార్పు, రుణాలు, ఆహార భద్రత, సుస్థిరత, భౌగోళిక రాజకీయ సంఘర్షణ వంటివాటిపై చర్చిస్తారు. ఈసారి జీ20 సమావేశాలను ‘ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ థీమ్‌తో నిర్వహిస్తుండగా భారత్ అధ్యక్షత వహిస్తోంది.
సదస్సుకు హాజరవుతున్న ప్రపంచాధినేతలను ఆహ్వానించేందుకు ప్రధాని నరేంద్రమోదీ భారత మండపానికి చేరుకున్నారు. సదస్సుకు హాజరవుతున్న ప్రపంచాధినేతలకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘ఎక్స్’ చేశారు.
10.30 గంటలకు సదస్సు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన జీ20 సదస్సులోనూ పాల్గొంటారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వాగతం పలికారు.