Bharat: జీ20 సదస్సులో ప్రధాని ముందు ‘భారత్’ నేమ్ ప్లేట్
- పేరు మార్పు ప్రచారానికి సానుకూల సంకేతం
- ఇప్పటి వరకు అధికారికంగా దీనిపై మాట్లాడని కేంద్ర సర్కారు
- మద్దతుగా పలువురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు
- ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలతో స్పష్టత
‘ఇండియా’ను తొలగించి దేశం పేరును భారత్ గా మార్చబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి, అది వాస్తవమేనన్న సంకేతం కనిపించింది. జీ20 సదస్సులో ప్రధాని మోదీ ముందు ‘భారత్’ నేమ్ ప్లేట్ కనిపించింది. జీ20 విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపించిన లేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్టు కేంద్ర సర్కారు చేసిన ప్రకటన పేరు మార్పుపై పెద్ద చర్చకు తెర తీయడం గమనార్హం.
ఇండియా కనీస ప్రక్రియను పాటించినప్పుడు ఇండియా పేరును భారత్ గా ఐక్యరాజ్యసమితి రికార్డుల్లో నమోదు చేస్తామని అధికార ప్రతినిధి తాజాగా ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ప్రత్యేక సమావేశాల అజెండా గురించి ఇంకా ప్రకటించలేదు. అజెండా ఏంటో చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశం పేరును మారుస్తున్నామంటూ కేంద్ర సర్కారు ఇంతవరకు అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. కాకపోతే, భారత్ కు మద్దతుగా కేంద్ర మంత్రులు పలువురు మాట్లాడడం దీన్నే సూచిస్తోంది. మరోవైపు ‘భారత్’ అంశంపై రాజకీయ వివాదానికి తావివ్వకుండా చూడాలని ప్రధాని మోదీ తన సహచర మంత్రులను కోరారు.