Kesineni Nani: ఇవన్నీ తాత్కాలికమే... చంద్రబాబు తెల్ల కాగితంలా బయటికి వస్తారు: కేశినేని నాని
- చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
- 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు మచ్చలేని నాయకుడన్న కేశినేని నాని
- అవినీతి మకిలి అంటని కొద్దిమందిలో చంద్రబాబు ఒకరని వెల్లడి
- తాము నిన్న ఉన్నాం, ఇవాళ ఉన్నాం, రేపు కూడా ఉంటామని ఉద్ఘాటన
తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కేశినేని మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు. ప్రొసీజర్ ను అనుసరించకుండా ఆయనను అరెస్ట్ చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు.
తన రాజకీయ జీవితం మొదటి నుంచి చంద్రబాబు ప్రజల కోసం, సమాజంకోసం కృషి చేశారని కేశినేని కొనియాడారు. ప్రపంచస్థాయి నేతలు, వ్యాపారవేత్తల నుంచి ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు.
"ఇలాంటివన్నీ తాత్కాలికమే అని నిన్ననే ఆయనకు చెప్పాను. భారతదేశంలో అవినీతి మకిలి అంటని అతి తక్కువ మంది రాజకీయ నేతల్లో చంద్రబాబు ఒకరు. ఈ వ్యవహారం నుంచి ఆయన క్లీన్ గా, ఒక తెల్ల కాగితంలా స్వచ్ఛంగా బయటికి వస్తారు. జగన్ మోహన్ రెడ్డికి ఒకటే చెబుతున్నాం... నిన్న మేం ఉన్నాం, ఇవాళ మేం ఉన్నాం, రేపు కూడా మేం ఉంటాం.
రాజకీయాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలే తప్ప కక్ష సాధింపు చర్యలతో ఏమీ చేయలేరు. పోలీసులు, ఐపీఎస్ లకు ఒకటే చెబుతున్నా... దేశం కోసం పనిచేస్తామని మీరు ప్రమాణం చేసి ఉంటారు. ఆ మాట నిలుపుకోండి. ఒక వ్యక్తి కోసం పనిచేయడం మానుకోండి" అంటూ కేశినేని నాని స్పష్టం చేశారు.