Pawan Kalyan: రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు... కాలినడకన మంగళగిరి బయల్దేరిన జనసేనాని
- జగ్గయ్యపేటకు తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు
- పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట
- ఏపీలోకి వచ్చేందుకు వీసా, పాస్ పోర్ట్ కావాలేమో అన్న పవన్ కల్యాణ్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. అయితే ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దుల్లో గరికపాడు వద్ద పోలీసులు జనసేనానిని అడ్డుకున్నారు. అనంతరం జగ్గయ్యపేట దాటిన తర్వాత ఏపీ పోలీసులు ఆపేశారు. అక్కడకు పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద కూడా పవన్ కల్యాణ్ కు పోలీసుల నుంచి ఆటంకం ఎదురైంది. దాంతో ఆయన వాహనం దిగి కాలినడకన మంగళగిరి బయల్దేరారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నంచడంతో పవన్ రోడ్డుపై పడుకున్నారు. పవన్ ను తిరిగి హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
జనసేన ఎక్స్ (ట్విట్టర్) వేదిక ఓ పోస్ట్ చేసింది. ఇందులో జనసేన కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు. వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... మనకు వీసా, పాస్ పోర్ట్ అవసరమేమో అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరినప్పటికీ మళ్లీ అనుమంచిపల్లి వద్ద మరోసారి పోలీసులు జనసేనాని వాహనాన్ని ఆపేశారు.
అంతకుముందు కూడా పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటన రద్దైన విషయం తెలిసిందే. చంద్రబాబును కలిసేందుకు జనసేనాని బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. అయితే శాంతిభద్రతల సమస్య ఉందని పోలీసులు ఆయనకు మెయిల్ చేయడంతో, బేగంపేట నుండి ఆయన కాన్వాయ్ వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరారు.