Christian Priest: అయ్యప్ప దీక్ష తీసుకున్న కేరళ చర్చి ఫాదర్.. చర్చ్ సర్వీస్ లైసెన్స్ వెనక్కి ఇచ్చేసిన రెవరెండ్ మనోజ్

Kerala Christian Priest To Visit Sabarimala Temple
  • తిరువనంతపురంలోని అంగ్లికాన్ చర్చ్ ప్రీస్ట్‌గా రెవరెండ్ మనోజ్
  • ఈ నెల 20న అయ్యప్పను దర్శించుకోనున్న మనోజ్
  • వివరణ అడిగిన చర్చి అధికారులకు లైసెన్స్ తిరిగి ఇచ్చేసిన వైనం
  • హిందూ మతాన్ని దాని ఆచారాలకు అతీతంగా అర్థం చేసుకోవడమే తన లక్ష్యమన్న వైనం
కేరళలో ఓ చర్చి ఫాదర్ అయ్యప్పస్వామి భక్తుడిగా మారారు. ఇందుకోసం ఆయన తన సేవకుడి లైసెన్స్‌ను కూడా వదులుకున్నారు. అంతేకాదు, 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకున్న ఆయన త్వరలోనే అయ్యప్పను దర్శించుకోనున్నారు. తిరువనంతపురంలోని అంగ్లికాన్ చర్చ్ ఆఫ్ ఇండియా మతాధికారి అయిన రెవరెండ్ మనోజ్  ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఈ నెల 20న స్వామిని దర్శించుకోనున్నారు. 

విషయం తెలిసిన చర్చ్ అధికారులు.. ఇది తగదని, వివరణ ఇవ్వాలని మనోజ్‌ను ఆదేశించారు. దానికి ఆయన దీటుగా స్పందించారు. వివరణ ఇవ్వకుండా తన ఐడీ కార్డ్, ప్రీస్ట్‌హుడ్‌ తీసుకున్నప్పుడు ఇచ్చిన లైసెన్స్‌ను తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు, అంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సిద్ధాంతాలు, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అంగీకరించారు. 

దేవుడు ప్రతి ఒక్కరినీ కులమత విశ్వాసాలతో సంబంధం లేకుండా ప్రేమించమన్నాడని, కాబట్టి మీరు చర్చి సిద్ధాంతాన్ని అనుసరిస్తారా? లేదంటే దేవుడి సిద్ధాంతాన్ని అనుసరించాలా? అనేది నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు. తన దీక్షపై వస్తున్న విమర్శలకు మనోజ్ ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా స్పందించారు. మీరు ప్రేమించేది చర్చినా? దేవుడినా? అన్నది మీరు నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు.  

ప్రీస్ట్‌హుడ్ తీసుకోవడానికి ముందు మనోజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్న మనోజ్ నల్లదుస్తులు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 20న ఆయన శబరిమల అయ్యప్పను దర్శించుకోనున్నారు. తానేమీ తప్పు చేయలేదని విశ్వసిస్తున్నానని, హిందూ మతాన్ని దాని ఆచారాలకు అతీతంగా అర్థం చేసుకోవడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు. క్రైస్తవంలో తాను అదే పని చేశానని వివరించారు.
Christian Priest
Sabarimala Temple
Kerala
Anglican Church of India

More Telugu News